మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

  Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం
 

Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం

 telugu పండుగలు  తెలుగు - కథలు దేవిదేవతలు అద్భుతమైన తెలుగు సూక్తులు |telugu motivation|telugu ... 

హిందూ నాగరికత చారిత్రక కాలక్రమం: క్రీ.పూ. 2000లకు ముందు..... సింధు లోయ నాగరికత - క్రీ.పూ. 1500-500 .... వేదయుగం - క్రీ.పూ. 500-క్రీ.శ.500 .... ఇతిహాస, పురాణ,  చారిత్రక యుగం - క్రీ.శ. 500-1500 .... మధ్యయుగం - క్రీ.శ. 1500-1757 ..... పూర్వ ఆధునిక యుగం క్రీ.శ. 1757-1947 బ్రిటిష్‌‌ యుగం .... సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఆగమాలు మరియు స్తోత్రాలు. ఈ గ్రంథాలలో సనాతన ధర్మం యొక్క మూలాలు, సూత్రాలు, నైతిక నియమాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నాయి. వీటిలో వేదాలు అత్యంత ప్రాచీనమైనవి మరియు ముఖ్యమైనవి, వీటిలో నాలుగు వేదాలు ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అధర్వణ వేదం.

   

కంసవధ


ఒకనాడు ప్రలంబుడను రాక్షసుడు గోపబాలుని రూపమున వచ్చి గోపాలురతో ఆటలలో పాల్గొనుచుండెను. ఆ ట ఆనియమము ప్రకారము ఓడిపోయినవారు గెలిచిన వారిని వీపు మీద ఎక్కించుకొని మోయవలెను. ఆ యాటలో బలరాముని చేతిలో ఓడిపోయిన ప్రలంబుడు బలరాముని వీపుమీద దూరముగా తీసుకోనిపోయి తన నిజరూపమును దాల్చి బలరాముని చంపబోయెను. బలరాముడు వానిని ఎదుర్కొని శిరస్సుమీద గ్రుద్దు వేయగా ఆ రాక్షసుడు తల పగిలి చనిపోయెను.

మరొకనాడు కృష్ణుడు గోపాలురతోను గోవులతోను అడవులలో తిరుగుచూ దాహపీడితులై ఖాండవవనం నుండి ఇషీకవనంలోకి ప్రవేశించగా, ఘోరమైన దావానలము ఆ యడవినంతనూ చుట్టుకొనెను. భయభ్రాంతులైన గోపాలురు కృష్ణుని ఆశ్రయించగా, వారినందరునూ తనయొద్దకు జేర్చుకొని, వారందరను కండ్లు మూసుకొనమని చెప్పి తృటికాలములో ఖాండవ వనమునకు జేర్చి కండ్లు తెరువమనెను. ఇషీకవనముగాని, దావానలముగాని కానక ఇదంతయూ కృష్ణుని మహిమయని గుర్తించి సాక్షాత్‌ భగవానునిగా స్తుతించిరి.

గోఫికా వస్త్రపహరణము

ఇట్లు కొంత కాలము గడువ హేమంతఋతువు మార్గ శీర్షమాసముతో ప్రకాశించెను. గోపికలు కాత్యాయనీ వ్రతము ఒకమాసము జరుపుటకుగాను కాళిందీనదిలో స్నానము చేసి తీరము సైకత ప్రతిమను ప్రతిష్ఠించి దానియందు ఆ దేవిని ఆవాహనము చేసి, పూజించి, కృష్ణుని తమకు భర్తగా చేయుమని ప్రార్థించిరి. ఈ మాసవ్రతములో కృష్ణునియందు లగ్నమనస్కలై ఆ దేవిని పూజించుచు కృష్ణలీలలు పాడుకొనుచుండిరి.

ఒకనాడు వారు వస్త్రములు ఒడ్డున విడిచి నదిలో వివస్త్రలుగా స్నానముచేయుచుండిరి. ఇట్లు వివస్త్రలుగ స్నానము చేయుట వ్రతమునకు భంగమగుటచే దానిని సఫలీకృతము చేయు ఉద్దేశముతో కృష్ణుడు ఆ వస్త్రములనన్నింటిని తీసుకొని ఒక చెట్టుపైకెక్కి కూర్చొనెను. ఆ గోపికలు స్నానానంతరము నదిఒడ్డున తమ వస్త్రములు కానక, చెట్టుమీదనున్న కృష్ణుడు తమ చీరెలను అపహరించినాడని గ్రహించి, కృష్ణుని తమచీరెలు ఇమ్మని ప్రార్థించిరి. కృష్ణుడు వారిని బయటకు వచ్చి తీసుకొనమని చెప్పెను. దిగంబరులగుటచే సిగ్గుచేత వారుబయటకు రాజాలక ' మేము మీ దాసులము అనుగ్రహించి మావస్త్రములు మాకిమ్మ' ని కోరిరి. ఇవ్వనిచో రాజునకు చెప్పెదమని బెదిరించిరి. ' మీరు దాసిలైనచో నేను చెప్పినట్లు నడుచుకొనుడు. మీరు బయటకు నచ్చియే వస్త్రములను తీసుకొనవలెను. రాజుకు చెప్పిన నాకేమియూ భయములేదు' అని కృష్ణుడు అనెను. అంత గత్యంతరము లేనివారై గోపికలు తమ మర్మావయనములు చేతితో కప్పుకొని బయటకు వచ్చి ప్రార్థించిరి. " దిగంబరులై స్నానము చేయుటచేత మీరు దేవతాపరాధము చేసిరి గాన, అందుకు పరిహారముగా రెండుచేతులు జోడించి శిరస్సువంచి నమస్కరించండి. ఒక్కచేయితో నమస్కారము పాపము కనుక రెండునూ పరిహరమగును" అని కృష్ణుడు చెప్పగా, వారు తమ సర్వాపరాధ క్షమార్పణకు గాను రెండు చేతులు ఎత్తి నమస్కరించి తమతమ వస్త్రములను తీసుకొనిరి. ' ఇప్పుడు మీరు దోషరహితులుగాన నేను సంతసించితిని. మీ సంగల్పము నెరవేర్చెద' నని వాగ్దానము చేసెను.

మునిపత్నులు భోజనము పెట్టుట

కృష్ణ బలరాములు గోపాలురతో కూడి వనములో పశువులను మేపుచుండగా, గోపాలురకు క్షుద్బాధ ఎక్కుయ్యెను. కృష్ణుని అడుగగా అచటకు కొంత దూరములో ఆంగీరస సత్రయాగము చేయుచున్న బ్రహ్మణులవద్దకు తాముపంపినామని చెప్పి అన్నము తీసుకొనిరండని చెప్పిపంపెను. గోపబాలురు ఆ బ్రహ్మణులను రామకృష్ణులు పంపగా వచ్చినామని చెప్పి అన్నము అడుగగా, ఆ బ్రహ్మ ణులు క్షుద్ర ఫలమునాసించి కర్మచేయుచున్నవారై కృష్ణుని సామాన్య మానవునిగా తలచి, వారికి అన్నమిడక తరిమివేసిరి. వారి తిరిగిరాగా కృష్ణుడు వారిని తిరిగి ఆ బ్రహ్మణుల భార్యలవద్దకు పంపెను. అంతకు ముందు ఆ మునిపత్నులు కృష్ణుని అద్భుత లీలలు వినుటయేగాని దర్శనము చేయని కారణముచే, అప్పుడు దర్శనము కలుగునని కుతూహాలముతో భక్ష్యభోజ్యాది రూపమైన అన్నమును పాత్రలలో పెట్టుకొని వారి భర్తలు వారించిననూ ఆగక కృష్ణునివద్దకు పరుగిడిరి. కృష్ణుడు వారు తెచ్చిన భోజనమును గోపాలురతో తృప్తిగా ఆరగించెను. వారి భర్తలు వారించిననూ వినక వచ్చినందున, తిరిగి వెళ్ళిన భర్తలు స్వీకరింపరేమోయని భయపడుచున్న ముని పత్నులకు అభయమిచ్చి, మీ భర్తలు మిమ్ము ఇతోధిక ప్రేమతో స్వీకరించెదరని చెప్పిపంపెను. ఆ బ్రహ్మణులును పత్నులు రాగానే వారిని ఎంతో ప్రేమతో స్వీకరించి తాము చేయుచున్న యజ్ఞమునకు ఫలమునిచ్చు భగవంతుడే కృష్ణుని రూపమున వచ్చి అన్నము అడిగిన పెట్టలేక పోతిమేయని తమ అపరాధముని తెలుసికొని పశ్చాత్తాపము పొంది స్త్రీలకు భగవంతునియందున్న భక్తి పురుషులై పండితులైన తమకు లేకపోయెనే యని వగచి భగవంతుని యందు భక్తిని ప్రేరేపింపలేని తమ కర్మానుష్ఠానమును నిందుంచుకొనిరి.

ఆ బ్రహ్మణపత్నులు కృష్ణునివద్దకు వెళ్ళేసమయంలో ఒక బ్రహ్మణుడు తన భార్యను గట్టిగా నిరోధించటంవల్ల ఆమె వెళ్ళలేకపోయినది. తానువిన్న కృష్ణలీలలను, రూపగుణాదులము ధ్యానంచేస్తూ ఈ భౌతికశరీరాన్ని వదలి శుద్ధసత్వమయదేహం ధరించి కృష్ణసాన్నిధ్యం పొందినది.

గోవర్ధనోద్ధరణము

నందుడును గోపవృద్ధులును ప్రతిసంవత్సరము చేయు ఇంద్రయాగమునకు ప్రయత్నములు సల్పుచుండ కృష్ణుడు వారయొద్దకుపోయి ఈయాగ పరమార్థమేమి యని అడిగెను. అందుకు నందుడు "కృష్ణా, ఈ యాగమువలన ఇంద్రుడు తృప్తుడై వర్షమును కురియించును. మన భూములు సస్యశ్యామలములై మనకు ధాన్యము, పశువులకు గ్రాసము లభించును. మనకు ఆనందము చేకూరును" అని సమాధానము చెప్పెను. కృష్ణుడు ' ఇంద్రుడు గూడ కర్మ పరతంత్రుడే గనుక అతడేమి చేయగలడు ? ఆయన తృప్తి కొరకు ఈ యాగము అనవసరము. మనలను నిత్యమూ కాపాడుచున్నది ఈ గోవర్ధనపర్వతము, గోవులు, బ్రహ్మణులు. ఈ మువ్వురనూ ఇంద్రయాగమునకై తెచ్చిన వస్తుసంబారముతో పూజించి వండిన పదార్థములు గోవర్థనగిరికి నివేదన చేసి పర్వతమునకు ప్రదక్షిణ చేయండి. ఈ యాగము గోబ్రాహ్మణపర్వత యాగము. మీ యభీష్టములన్నీయూ ఈ మువ్వురివల్లనూ నెరవేరును.' అని చెప్పి ఆ విధముగా వారిచే పూజచేయించి నివేదించిన పదార్థమును గోవర్ధనపర్వతరూపమును తానావహించి ఆరగించి తన నిజరూపమున కనపడి ' మీరందరూ ప్రతిసంవత్సరము చేయు యాగములో మీరు నివేదించిన పదార్థములను ఇంద్రు డెప్పుడైన స్వీకరించినాడా? ఈ రోజున మీ నివేదనలు ఈ పర్వతము స్వీకరించినది! మీ గోవులకు గడ్డిని పుష్కలముగా యిచ్చి గోవులను మనలను రక్షించుచున్నది. బ్రహ్మణులు వేదమంత్రములతో మనలను రక్షించుచున్నారు. ఈ యాగము యొక్క ఫలము మనకు ప్రత్యక్షముగా కనుపడినది.' అని వారందరికూ విశ్వాసము కలుగచేసి, వారందరితో గోవర్ధన గిరికి ప్రదక్షిణగావించి తాను ముందు మ్రొక్క గోపాలురునూ దండప్రణామము లాచరించిరి. ఈ విషయము తెలిసిన ఇంద్రుడు కృద్ధుడై వీరందరనూ శిక్షింప నిశ్చయించి ప్రళయకాలమున లోకములను ముంచివేయుసామర్థ్యముగల సంవర్తక మేఘమును గోకులము మీదికి పంపెను. ఆ మేఘము అవిచ్చిన్నధారాపాతముతో గోకులమునంతనూ జలమయముచేయగా, గోకులవాసులు కృష్ణుని శరణుజొచ్చిరి. గోవులును కృష్ణుని సన్నిధికి చేరినవి. ఇంద్రుని ఈయాగడమునుచూచి ఆతని గర్వ మడంపదలచి, గోవర్ధనగిరిని ఒక చేతితో ఎత్తి గొడుగువలె ఏర్పరచి గోకులవాసులను గోవులను ఈ పర్వతముక్రిందతలదాచుకొమ్మని అభయమిచ్చెను. వారందరూ ఆపర్వతచ్ఛాయలో సుఖముగ ఏడురోజులు ఉండిరి. ఈ అద్భుత చర్యను చూచిన ఇంద్రుడు గర్వము ఉడుగగా, మేఘములను ఉపసంహరించెను. గోకులవాసులు సూర్యరశ్మిరాగా తమ యిండ్లకుపోయిరి. గోవర్ధనగిరి యధాస్థానమున ఉంచబడెను. యశోద, రోహిణి మున్నగు గోకులవాసులు కృష్ణుని కౌగలించుకొని ఆశీర్వదించిరి. అంత ఆకాశమునుండి పుష్పవర్షము కురిసెను. గంధర్వులు గానము చేసిరి.

ఇంద్రుడు తన అపరాధమునకు సిగ్గుపడి తన కిరీటముతో సహా కృష్ణునికి మ్రొక్కి క్షమార్పణవేడి, తనకు గూడ కృష్ణుని ప్రభువుగా పట్టాభిషేకము చేయుటకుగాని కామధేనువును రప్పించి, దాని క్షీరముతోనూ గంగాజలముతోనూ అభిషేకించి కృష్ణునకు " గోవింద'' అను బిరుదునిచ్చెను. ఇట్టి అద్భుత పట్టాభిషేకసమయమున నారదతుంబురులు గానము చేయ, గంధర్వులు నాట్యమాడిరి. ఇట్టి అభిషేకఫలితముగా సస్యములు చక్కగా ఫలించి ప్రజలు సుఖించిరి. అనంతరము ఇంద్రుడు స్వర్గమునకు వెడలెను.

కృష్ణుడు నందుని వరుణలోకమునుండి తెచ్చుట

ఒక ఏకాదశినాడు నందుడు ఉపవాసము చేసి మరునాడు ద్వాదశిఘడియలు కొద్దిగా ఉండుటచే అరుణోదయమునకు పూర్వమే యమునానదికి పోయి స్నానము చేయుచుండగా ఒక అసురుడు నందునిపట్టుకొని వరుణలోకములోనికి గొంపోయి వరుణునివద్దనిల్పెను. నందుని కాననివారై గోకులవాసులు దుఃఖించుచూ కృష్ణుని ప్రార్థించగా కృష్ణుడు వారికి అభయమిచ్చి వరుణలోకమునకు పోయెను. వరుణలోకవాసులందరూ సాక్షాత్‌ భగవత్‌ స్వరూపుడైన కృష్ణుడు తమలోకమునకు వచ్చినందులకు గౌరవించి, నందుని తెచ్చిన అపరాధమునకు క్షమించమని ప్రార్థించి ఈ విధముగా కృష్ణుని దర్శనమైనందుల కెంతయో ముదమునందరి. కృష్ణుడు నందునితో తిరిగివచ్చి వరుణలోక విశేషములను గోకులవాసులకు చెప్పి ఆనందపరచెను.

రాసక్రీడ

కృష్ణుడు పూర్వము గోపికలకు తానుచేసిన వాగ్దానము ననుసరించి శరత్కాలపువెన్నెలలో వారితో క్రీడింపదలచి వేణుగానము చేసెను. ఆగానమాధుర్యమునకు తన్మయులైన గోపికలు వారుచేయుచున్న పనులను అంతటితో వదలి పరుగున వచ్చి కృష్ణుని కౌగలించుకొని క్రీడించిరి. కృష్ణుడు వారందరి యోగక్షేమములు అడిగి ఇంత అర్థరాత్రివేళ అడవికి వచ్చుట ధర్మము కాదని వారిని తిరిగి వెళ్ళిపొమ్మని చెప్పెను. అందుకు ఆ గోపికలు కంట నీరిడి, " కృష్ణా! యిట్లు కఠినోక్తులు పలుకతగదు. మాచిత్తములు నీవు హరించితివి. మాపాదములు కదులుట లేదు. మేము నీకు దాసులమైతిమి. నిన్ను వదలి ఎచ్చటకునూ వెళ్ళలేము. మమ్ములను గ్రహించి నీచేతులతో మా స్తనములను శిరమును స్పృసించి మా మదన తాపమును పోగోట్టుము" అని దీనవదనలై విన్నవించిరి. కృష్ణుడు చిరునగవుతో వారినందరనూ సంతోషపేట్టి అనేకవిధముల వారిని రమింపజేసెను. కృష్ణుని అనుగ్రహము పొందిన గోపకాంతలు తమకే యిట్టి మహాద్భాగ్యము కలిగినందుకు గర్వించి సౌభాగ్యమదమానములను వ్యక్తము చేయగా కృష్ణుడు వారిమధ్యనుండి అంతర్థానమయ్యెను. అంతట గోపికలు విరహతాపము భరింలేక కృష్ణలీలలు పాడుకొనుచూ కృష్ణుని చర్యలు అనుకరించుచూ, కృష్ణుడు వెదకుచు గీతములు పాడిరి. ఆ గీతలు గోపికాగీతలని చాల అద్భుతమైనభావములతో చాల ప్రఖ్యాతిగాంచినవి. ఇట్లువిలపించచున్న గోపికలమధ్య జగన్మోహనరూపముతో కృష్ణుడు ప్రత్యక్షమవగా, గోపికలు పోయిన ప్రాణములు తిరిగి వచ్చినట్లు ఆనందించికృష్ణుని అనేక విధముల సేవించిరి. కృష్ణుడు తాను అంతర్థానమగుట, గోపికల ప్రేమ భావమును ద్విగగుణీకృతముచేయుట కేయని నచ్చచెప్పి వారిని సంతృప్తిపరచి విరహతాపమును పోగొట్టెను.

తరువాత కృష్ణచంద్రుడు గోపకామినులతో రాసక్రీడను సలిపెను. గోపికలందరూ వలయాకారముగా నుండగా కృష్ణుడు ప్రతిగోపికప్రక్కను ఇద్దరిద్దరి నడుమ నిలచి వారి మీదబాహువులు చాపి రాసక్రీడ అద్భుతముగా సాగించెను.

ఈ ఉత్సవమునుచూ ఆకసమున దేవతలందరూ తమతమ విమానములమీద విచ్చేసిరి . దేవదుందుభులుమ్రోగెను. పుష్పవర్షము కురిసెను. కృష్ణుడు ఆ గోపికలతో అనేకవిధముల శృంగార లీలలు జరిపి వారిని సంతోషపరచి, వారితో జలక్రీడలాడుటకు యమునానదిలోనికి జని ఒకరిపై నొకరు జలములు చల్లుకొనుచూ అత్యంత ఆనందముతో జలక్రీడలు సల్పిరి.

రాసక్రీడవిమర్శ

రాస క్రీడ అనునది ధర్మవిద్ధముకాదా యనిసంశయము కలుగవచ్చును. ఈరాసక్రీడ జరుగు కాలమున కృష్ణునికి ఏడు సంవత్సరముల వయస్సు వుండెను. అట్టి వయస్సులో స్త్రీలతో రమించుట యనునది లౌకిక దృష్టిలో అసంభవముగదా! ఇంకను కృష్ణుడు మానవుడుగాక ఈశ్వరుడను దృష్టిలో విమర్శించినను, అద్భుతతేజో మహిమ గల ఈశ్వరావతారులకు ఇట్టిది దోషకారణముకాదు. అగ్ని హోత్రుడు సర్వమును భక్షించినను ఆయన కేమియూ దోషము అంటనట్లుగా రాసక్రీడ దోషము కానేరదు. ఇంకను దేవకీ వసుదేవులకు జన్మించిన కృష్ణుడు ఒక్కడేయుండగా వేలాది గోపికలతో ప్రతిగోపిక ప్రక్కను ఇంకొక కృష్ణుడుగా జత గూడి రాసక్రీడ చేసినను, ఇందరు కృష్ణులు ఎచ్చటి నుండి వచ్చిరి! ఇదంతయూ మానవమేధస్సునకు అందునది కాదు. సర్వశక్తిసంపన్నులు, సర్వజ్ఞులు అగు భగవదవతారపురుషుల చర్యలు అల్పశక్తిగల మానవులు విమర్శించరాదు. సామాన్య మానవధర్మములు వారికి వర్తించవు. ఇట్లు లౌకిక దృష్టిచేతను, ఈశ్వరదృష్టిచేతను రాసక్రీడ అధర్మముకాదని తేలినది. ఇంక ఆధ్యాత్మికదృష్టితో చూచిన, కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు. ఆయన సర్వవ్యాపకుడుగాన సృష్టియంతయూ ఆయన స్వరుపమే! ఆయనకంటే భిన్నమైన వస్తువే లేదు గోపికలురూపములోనున్న జీవులందరునూ ఆయన ప్రతిబింబములే. కృష్ణుడు గోపికలతో రాసక్రీడజరిపినాడనిన, బింబభూతుడైన కృష్ణుడు తన ప్రతిబింబములైన గోపికలతో క్రీడసల్పినాడని అర్థము. పరస్త్రీతో సంచరించిన వ్యభిచారమగునుగాని ప్రతిబింబములతో సంచరించుటను ఒక కర్మగా చెప్పుటకు వీలుగా లేదు గదా! కనుక ఈ మూడు విధములు చూచిన రాస క్రీడ ఆక్షేపమణీయు కాదు. మరియు గోపికలు కృష్ణునితో వ్యభిచరించినారనిన గోపికల భర్తలు ఈవిషయమై అసూయాక్రోధములతో కృష్ణుని నిందించవలెనుగదా! అట్లుగాక వారు తమభార్యలు అదేసమయమున తమప్రక్కనే వున్నారని సంతోషముతో నుండిరి! ఇక ఎవరి మీద ఎవరు నేరము మోపవలెను? కృష్ణునితో గోపికలు క్రీడించినది

నిజమే! అదే సమయమున వారి భర్తలప్రక్కన వున్నదీ నిజమే! ఈ రెండు విషయములు ఎట్లు సమన్వయమగును?

ఈ గోపికలనగా రామావతార సమయమున మహర్షులు రాముని సౌందర్యమునకు మోహపడి రాముని కౌగిలించుకొనబోగా, రాముడు అందుల కంగీకరించక తాను కృష్ణావతార మెత్తినపుడు ఈ మహార్షులనందరనూ గోపికలుగా జన్మించి, తనను కౌగలించకొని తమ యభిష్టమును నెరవేర్చుకొనమనచెప్పి వారిని తృప్తిపరచెను. ఆ మహర్షులే గోపికలుగా జన్మించి కృష్ణునితో రాసక్రీడ సలిపిరి. స్త్రీలు వివాహము లేకుండా ఉండకూడదు గనుక ఈ గోపికలు వివాహితలుగా జూపిరి. కాని వీరికి భర్తిలతో నిజమైన సంసారబంధములేదు. కనుపించిన దంతయూ ఆభాససంబంధమే అసలుగోపికలు కృష్ణునితో విహరించుచుండగా ఆభాసగోపికలు భర్తలయొద్దవున్నట్లుగా సంచరించిరి. ఇట్టి కృష్ణునిచర్యలు సామాన్యమానవులబుద్ధికి గోచరించునవిగావు. కనుక విమర్శలకు అతీతములు.

భాగవత దశమస్కంధములో ఐదు అధ్యాయములు గల ఈ రాసక్రీడ ఘట్టము ముఖ్యమైనదే గాక. దీనిని చదివి మననము చేసిన అంతఃకరణమున కామవాసనలు నశించునని ఫలితము చెప్పబడినది అట్టిచో రాస క్రీడలు ధర్మవ్యతి క్రమణమని ఎట్లు చెప్పనగును? మరియు ఈ రాసక్రీడా ఘట్టమును చెప్పిన శుకయోగీంద్రుడు, స్త్రీపుంభేదమెరుగని సర్వాత్మభావముగల జీవన్ముక్త మహాపురుషుడు. అట్టి శుకుని నోటివెంట వచ్చినదంతయూ ధర్మమేగాని ధర్మవ్యతిక్రమణమెన్నటికీ కాజాలదు. ఇంకనూ ఈ ఘట్టమును వినిన పరీక్షిన్నరేంద్రుడు పరమ వైరాగ్యముతో, మోక్షము నందగోరిశ్రవణము చేయుచున్నవాడు, ధర్మవ్యతిక్రమణ ఘట్టమే అయిన విని హర్షించునా? ఈ బోధనయొక్క మాహాత్మ్యమువలన పరీక్షిత్తు మోక్షము పొందినట్లు చెప్పబడినది. ధర్మవ్యతిరిక్త బోధనయైన మోక్షము అసంభవముగదా! కృష్ణుని అలౌకిక చర్యలన్నియు అద్వైత సిధ్ధాంతపరముగానే అర్ధము చేసుకొనవలెను. కేవల లౌకికశృంగారభావముతోనే గోపికలు కృష్ణుని చేరలేదు. వారు కృష్ణుని, అందరిదేహములలో నున్న అంతర్యామిగా గ్రహించినట్లుగా వారు గానముచేసిన గోపికాగీతలు వ్యక్తముచేసినవి. ఇంకనూ ఏభావముచేతనైననూ కృష్ణునియందు సంపూర్తిగా చేరినయేడల వారందరకూ మోక్షమువచ్చును. భక్తిద్వారా చేరినయెడల ముక్తినిపొందెదరనుట నిస్సంశయమే! కేవల భక్తిభావముతోనేకాక ఇతర భావములతో గూడ కృష్ణునియందు మనస్సు లగ్నము చేసినవారు గూడ తరింతురు. వైరభావముతో శిశుపాలుడు, భయభావముతో కంసుడు తరించినట్లుగనే కామభావముతో గోపికలు తరించిరి. కనుక ఏభావముతో నైననూ మనస్సు భగవంతుని జేరుట ముఖ్యము.

ఒకసారి సుదర్శనుడను గంధర్వుడు శాపవశమున మహాసర్పమై నందుని కాటువేయగా కృష్ణుడు అది తెలసి దానిని తనకాలితో తన్ని విడిపించెను. కృష్ణుని పాదస్పర్శతో పాపవిమోచనుడైన ఆగంధర్వుడు శాపవిముక్తుడై కృష్ణుని స్తుతించి వెడలిపోయెను.

మరియొక తూరి కుభేరుని అనుచరుడైన శంఖచూడుడు గోపస్త్రీ బృందములో ప్రవేశించి వారిని భయపెట్టుచుండగా తెలిసి, కృష్ణుడు అతనిని సంహరించి అతని శిరస్సుననున్న రత్నమును తీసుకొనెను.

ఇంకొకసారి ఘోరమైన వృషభరూపముతో వృషభాసురడను రాక్షసుడు గోకులమును భయపెట్టగా, కృష్ణుడు వానిని గూడ చంపి వారిభయమును పోగొట్టెను. తరువాత కంసుడు కేసియను రాక్షసుని రామకృష్ణులను సంహరించుటకు గాను గోకులమునకు పంపగా వాడు ఘోరమైన ఆకారముదాల్చి కృష్ణుని మ్రింగుటకు రాగా, కృష్ణుడుతన ఎడమ చేయిన దానినోటలో పెట్టి మండుచున్న ఇనుమువలె చేయగా ఆ రాక్షసుని నోరుకాలి శ్వాసఆడక గిలగిలతన్నుకొని చనిపోయెను.

మహామాయావియగు మయుని కుమారుడు వ్యోమాసురుడు గోపాలరూపమున గోకులములో ప్రవేశించి గోపాలురు ఆడుచున్న దొంగాటలలో కృష్ణుని చంపుటకు పయత్నించగా కృష్ణుడు వానినిగూడ సంహిరించెను.

ఇంట్లుండగా ఒకనాడు నారదుడు వచ్చి కృష్ణజననరహస్యమును కంసునికి విశదపరచెను. అంతవరకు, కృష్ణుడు యశోదానందుల కుమారుడని యనుకొనుచుండిరే కానీ, దేవకీవసుదేవులకుపుట్టి యశోదానందులవద్ద పెరుగుచున్నాడని ఎవ్వరికిని తెలియదు. తనను చంపుటకు రామకృష్ణులు నందవ్రజములో పెరుగుచు చున్నారని నారదునిచే కంసుడు, కోపోద్రిక్తుడై చంపబోగా నారదుడు వారించెను. అంతట కంసుడు దేవకీవసుదేవులను లోహపాశములతో బంధించి, కారాగారములో పెట్టెను తరువాత మంత్రులతో ఆలోచించి, కంసుడు ధనుర్యాగమను పేరు నొక ఉత్సవమును చేయదలచినట్లును, దానికి రామకృష్ణులను ఆహ్వానించి వారిని, కువలయాపీడమను మదపుటేనుగుతో త్రొక్కించుటకు, చాణూరముష్టికులను మల్లులచే మల్లయుద్ధమున హతమొర్చుటకు పెద్ద పన్నాగము పన్ని అందుకు రామకృష్ణులను తోడితెచ్చుటకుగాను అకౄరునిపిలచి, తన పన్నాగమును ఆతనికి విశదపరచి, ఈ వియమును రహస్య ముగనుంచి, రామకృష్ణులను ధనుర్యాగమును చూచుటకు పిలుచుకొని రమ్మని చెప్పెను. భగవంతుడైన కృష్ణునియడ ఈ పన్నాగము పారదని అకౄరునకు తెలిసిననూ, ఈ ప్రమేయముగా నైననూ కృష్ణదర్శనము అగునుగదాయని స తసించి, కంసునకు ఇట్టి భావముకల్గుట తన జన్మాంతరపుణ్యవిశేషమని ఆనందించెను. ఇంకనూ, తాను వ్రజమునకు చేరగానే కృష్ణ దర్శనమగునని. ఆతని పాదములపైబడి నమస్కారము చేయుదునని, తనశిరస్సును కృష్ణుడు హస్తస్పర్శచే అనుగ్రహించుననియు అనేక భావపరంపరలలో మునిగిపోయెను. ఆఉదయము రథములో బయల్దేరి సాయం కాలమునకు నందవ్రజము చేరెను. కృష్ణభావనాప్రపంచంలో మునిగిన అకౄరుడు రథమును తోలుట మరచిపోయిననూ, రథము తానంతట అదియే నందవ్రజము చేరెను. ఆ గ్రామ పొలిమేరలో, అంకుశాది రేఖాలాంఛితములైన కృష్ణపాద చిహ్నములను గాంచి, రథముదిగి ఆ యడుగుజాడలలో పడి పొర్లాడెను. అంత రామకృష్ణులు గోశాలలో నున్నారని తెలిసికొని వారి వద్ద కేగి, ఆనందబాష్పములతో, వారి పాదములను కడిగెను. కృష్ణుడు వానిభక్తికి మెచ్చి కౌగిలించుకొని గృహమునకు తోడ్కొనిపోయిరి.

నందాదులు అకౄరుని యోగక్షేమముల నడిగి అర్ఘ్యపాద్యాదుల నిచ్చి సత్కరించిరి. భోజనానంతరము విశ్రమించిన తరువాత, కృష్ణుడు, అకౄరునితో, ''కౄరుడైన కంసుని కొలువులోవున్న మీకు కుశలమా అని అడుగుట ఎట్లు! అయిననూ, మీరు వచ్చినపని ఏమని'' అడిగెను. ''కంసుడు ధనుర్యాగమును చూచుటకు మీ ఇద్దరనూ తోడి తెమ్మని నన్ను పంపె''నని అకౄరుడు బదులు చెప్పెను. అంతట నందుడు ధనుర్యాగమును చూచుటకు గోపాలుర తోనూ రామకృష్ణుతోనూ కానుకలను తీసికొని రథములపై బైలుదేరగా, గోపికలు తమకు కృష్ణునితో వియోగము కల్పించిన అకౄరుని అనేక విధముల నిందించి విలపించిరి కృష్ణుడు గోపికలను 'త్వరలో తిరిగి వచ్చెద'దని ఊరడించి, ప్రయాణమై. యమునాది వద్దదిగి అందరూ స్నానములు చేసిరి. అకౄరుడుగూడ స్నానముచేసి నీటిలో మునుగగా ఆ నీటిలో రామకృష్ణుల దర్శనమయ్యెను. రథముమీద నున్న రామకృష్ణులు నీటిలోకి ఎట్టు వచ్చిరాయని తిరిగి చూడ, రథముపై రామకృష్ణులు కనపడిరి. మరల నీటిలోనూ కనపడిరి. ఇందతయూ సర్వేశ్వరుడు, భగవంతుడూ అయిన కృష్ణుని మాయావిలాసమని గ్రహించి పలు విధములు స్తుతించెను. అంతట మధురకు చేరగానే, కృష్ణుడు అకౄరుని ముందుగా వెళ్ళమనియు, తాను వెనుక వచ్చెదననియూ చెప్పిన, అకౄరుడు ముందుగా తనఇంట ఆతిథ్యమును స్వీకరింప ప్రార్థించెను. అందుకు కృష్ణుడు, కంసుని వధించనిదే మీ యింటికి రానని చెప్పిపంపెను. అకౄరుడు కంసుని కలిసి జరిగిన వృత్తాంతమంతయూ చెప్పెను. మరునాడు సాయంకాలము పురవీధులలో గోపాలురతో కూడి రామకృష్ణులు ప్రవేశించగా ఆ మన్మధమూర్తులను చూచి మేడలమీదనుంచి పురజనులు పుష్పవర్షము గురిపించిరి. పౌర సభ్యులు పూర్ణకుంభములో వారికి స్వాగతమిచ్చిరి. దారిలో కంసుని పరిచారకుడైన చాకలివానిని వస్త్రముల నిమ్మనగా, ఆతడు వారిని నిందించి వస్త్రములనిచ్చుటకు నిరాకరించెను. కృష్ణుడు వానిని సంహరించి, ఆ వస్త్రములను రామకృష్ణులు ధరించి ముందుకు సాగగా, తంతువాయువను నతడు విచిత్ర వస్త్రములను ఇవ్వగా, ధరించి వానిని ఆశీర్వదించి, సుదాముడను మాలకారుని ఆతిథ్యము స్వీకరించి ఆతనిని వరము కోరుకొమ్మనగా, ఆతడు భక్తినిమ్మని కోరెను. ఆతనికి ఆ వరము ప్రసాదించి, కంసుని కొరకై గంధమును తీసుకొని పోవుచున్న కుబ్జయను త్రివక్రయగు స్త్రీని చూచిరి. ఆమె రామకృష్ణుల జగన్మోహనాకారములను మోహించినదై ఆ గంధమును వారలకు అలదెను. కృష్ణుడు ఆమె భక్తికి సంతసించి మూడు వంకరులుగా నున్న ఆమె శరీరమును తన పాదములతో ఆమె పాదములను నొక్కి పైకి లాగగా ఆమె కృష్ణస్పర్శకు అపురూప సౌందర్యవతిగా మారెను. ఆమె కృష్ణుని తన యింటికి ఆహ్వానించి తన మనోభీష్టమును నెరవేర్చమని ప్రార్థింపగా, తాను మధురకు వచ్చిన పనిని పూర్తి చేసిన పిమ్మట అట్లే వచ్చెదనని అభయమిచ్చి ఆమెను పంపివేసెను.

అంతట కృష్ణుడు ధనుర్యాగము చేయుచున్న ప్రదేశమునకు జని, కావలివున్నవారు వారించిననూ లెక్కజేయక, ఆ యాగ ధనస్సును అవలీలగా విరచివైచెను. ఆ విరిగిన ధ్వనికి భూమి కంపించెను. కంసుడు అదరిపడెను. కంసుని పరివారము కృష్ణునిపైకి యుద్ధమునకు రాగా కృష్ణుడు వారి నందరనూ హతమార్చెను.

కంసుడు, కృష్ణుడు చేసిన ధనుర్భంగమునుగురించియు, కావలి వారిని సంహరించిన సంగతియు, తలచుకొని ప్రతినిమిషమునూ కృష్ణుని తలచుకొనుచూ, భయముతో నిద్రపట్టక తన మరణమును సూచించు ఉత్పాతములు కనెను. స్వప్నమున తన శిరస్సు తనకు కనుపించలేదు. చంద్రబింబము రెండుగా కానిపించెను. తన ప్రతిబింబములో రంధ్రములు కనపడెను. తన అడుగులు కనబడకుండెను. శవమును కౌగలించు కొన్నట్లును, గాడిదనెక్కినట్లు, తైలాభ్యంగనము చేయుచున్నట్లు, వస్త్రహీనుడుగ నున్నట్లును, దుస్వప్నములు కలుగగా మరణభీతుడై సంచరించెను.

మరునాడు ఏర్పాటు చేయబడిన మల్ల క్రీడామహోత్సవమునకు ఆహ్వానితులైన వీరులందరూ వచ్చిరి. కంసుడు పరివారముతో కొలువుతీర్చి కూర్చొనియుండెను. గోపాలురు తాము తెచ్చిన కానుకలను కంసునకు అర్పించిరి. చాణూర ముష్టికులను మల్లులు రంగస్థలమునకు వచ్చిరి. రామకృష్ణులు వారిని కలియ రాబోవుచుండగా ద్వారమున కువలయాపీడమను ఏనుగును దారికి అడ్డముగా నిలిపెను. కృష్ణుడు అడ్డము తొలగించమనిన, ఆ ఏనుగును కృష్ణునిపైకి తోలెను. అది కృష్ణుని తొండముతో పట్టుకొనగా, లాఘవముగా తప్పించుకొని, దానిదంతము నూడపెరికి దానితో ఆ ఏనుగును సంహరించెను. ఆ సమయమున కృష్ణుడు మల్లవీరులకు పిడుగుగాను, పురుషులకు పురుషోత్తముడుగానూ, స్త్రీలకు మన్మధుడుగానూ, దుష్టులకు శాసకుడుగానూ, గోపాలురకు బంధువు గానూ, తల్లిదండ్రులకు బిడ్డగానూ, అవిద్వాంసులకు విరాట్టు గానూ, యోగులకు పరతత్వముగానూ, యాదవులకు పరదేవతగానూ, కంసునకు మృత్యువుగానూ కానిపించెను. సభలోని వారందరూ కృష్ణుని వీరగాధలు స్మరించుకొనుచూ, సాక్షాత్తు భగవంతుడేయని స్తుతించుచుండిరి.

ఆ తరువాత చాణూరముష్టికులతో మల్లయుద్ధము ప్రారంభమయ్యెను. సభలోని వారందరును రామకృష్ణులవంటి బాలురతో పర్వతాకారులైన మల్లులు యద్ధముచేయుట అధర్మమని అనుకొనుచుండిరి.

రామకృష్ణుల గాఢ ముష్టిప్రహారములకు చాణూర ముష్టికులు నెత్తురు కక్కుకొని ప్రాణములు విడిచిరి. రామకృష్ణుల ఈవిజయమునకు సభలోని వారందరూ బ్రహ్మనందమందగా కంసుడు భయపడి రామకృష్ణులపైకి భటులను తోలెను. అంతలో కృష్ణుడు కంసుని సింహాసనము మీదికి ఉరికి గరుత్మంతుడు పామును పట్టినట్లు పట్టి రంగస్థలము మీదికి లాగి వానిపై బడి సంహరించెను. కంసుడు ఎల్లవేళలా తినుచూ, త్రాగుచూ, ఏపని చేయుచున్నను కృష్ణుని మనస్సులో తలచుకొని భయముతో ప్రవర్తించుచు ప్రాణము వదలినందున కంసుని తేజస్సు కృష్ణునిలో ప్రవేశించి సారూప్యమునొందెను. ఆతరువాత మీదికి వచ్చిన కంసపరివారమును వరిమార్చెను. పుష్పవర్షము కురిసెను. దేవదుందుభులు మ్రోగెను. అప్సరసలు నాట్యమాడిరి.

కంసుని మరణ వార్తవిన్న అతనిభార్యలు అచ్చటకువచ్చి శోకించుచు సృష్టిస్థితిలయములకు కారుకుడైన భగవంతునితో విరోధము పెట్టుకొనుటవల్లనే తమభర్తకిట్టి దుర్మరణముకలిగెనని విలపించిరి. కృష్ణుడు వారిని ఓదార్చి కంసునికి ఉత్తరక్రియలు జరిపించెను.

అంతట రామకృష్ణులు తల్లిదండ్రులైన దేవకీవసుదేవులను కారాగార విముక్తులగావించి కుమారులుగా పుట్టియు కష్టములపాల్పడిన తల్లిదండ్రులకు సేవచేయలేని అపరాధమునకు క్షమాభిక్ష ప్రార్థించిరి. దేవకీవసుదేవులు వారిని లేవనెత్తి కౌగలించుకొని ఆనందబాష్పములను రాల్చిరి.

అనంతరము మాతామహుడైన ఉగ్రసేనమహారాజును రాజ్యాధిపతిగావించి, కంసునకి భయపడి చెల్లాచెదరైన రాజవంశీయులందరనూ రావించెను.

తరువాత రామకృష్ణులు నందయశోదలవద్దకు వచ్చి, వారి వాత్సల్యమును కొనియాడి, త్వరలోనే తిరిగి వ్రేపల్లెకు వచ్చెదమని ఊరడించి వారిని పంపివేసెను.

వసుదేవుడు గర్గాచార్యులను పిలిపించి రామకృష్ణులకు యధాశాస్త్రీయముగా ఉపసయన సంస్కారము గావించి ఆశుభసమయమున విప్రులనుపూజించి అనేకగోవులనుదానము చేసెను. ఇట్లు ఉపనీతులైన రామకృష్ణులు తాము సర్వజ్ఞులయ్యూ, మానుషవేషధారులగుటచే లోకవిడంబనార్థము గురుకులవాసమొనర్ప కాశీపురికి జని సాందీపుని యొద్ద పరమ భక్తితో సకల వేదమలను, వేదాంగములను, వేదాంతమును, చతుష్టష్టికళలను అరువదినాలుగు అహోరాత్రములలో అభ్యసించిరి. విద్యాభ్యాసము పూర్తిచేసి గురుదక్షిణకోర మనగా సాందీపుడు భార్యతో సంప్రదించి మున్నెన్నడో ప్రభాసక్షేత్రమున సముద్రములో పడిచనిపోయిన తనకుమారుని దక్షిణగా యిమ్మని కోరెను. కృష్ణుడు వెంటనే ప్రభాస క్షేత్రమునకు జని, సముద్రునివలన, గురుపుత్రుడు శంఖరూపుడగు పంచజనుడను రాక్షసునిచే హరింపబడెనని తెలిసికొని, సముద్రగర్భమున ఆదానవునితో పోరాడి, సంహరించి, ఆతని ఉదరమున గురుపుత్రుని కానక, ఆరాక్షసుని శంఖమును తీసుకొని యమపురికి పోయి శంఖము ఊదిరి. యముడు ఎదురువచ్చి వారువచ్చిన సంగతి తెలిసికొని గురుపుత్రుని వారికి వప్పగించెను. రామకృష్ణులు ఆకుర్రవానిని సాందీపునికి సమర్పించి గురువు అనుజ్ఞతీసుకొని మధురాపురమునకు తిరిగి వచ్చిరి. మధరాపురవాసులందరూ రామకృష్ణులు తిరిగి రాగానే పోయినసొమ్ములు తిరిగిదొరికినంత ఆనందముపొందిరి.

కృష్ణుడు త్రివక్రయగు కుబ్జకు ఇచ్చిన వాగ్దానమును చెల్లించుకొనుటకుగాను ఉద్ధవునితో ఆమె గృహమునకు వెడలెను. కుబ్జ అమితానందముతో కృష్ణుని సుఖాసనాసీనుని చేసెను. కృష్ణునితోసమానముగ ఆసనము సంగీకరింపక క్రింద కూర్చొన్న ఉద్ధవునిగూడ తగినవిధముగ సత్కరించెను. అంత ఆసుందరి చక్కని అలంగారములతో కృష్ణునిగూడి రమించెను. ఆమె మనోభీష్టము నెరవేరిన పిదప ఉద్ధవునితో తిరిగి వెడలిపోయెను. అంత అకౄరునికి ఇచ్చిన వాగ్దానమును గూడ చెల్లించుటకు బలరామునితోనూ ఉద్ధవునితోనూ అతనిగృహమున కేగిరి. ఉద్ధపుడు వారికెదురేగి అర్ఘ్యపాద్యాదులొసంగి, వారిపాదోదకములు శిరస్సున జల్లుకొని పూజించి ఉపచారములు సల్పెను. రామకృష్ణుల రాకవలన తనగృహము పావనమైనదనియూ, భార్యాపుత్రాదిరూపమున భాదించుచున్న మాయకు తొలగించి కృతార్థుని చేయమనిప్రార్థించెను.

కృష్ణుడు ఉద్ధవుని గోపికలవద్దకు పంపుట

భ్రమరగీతలు

కృష్ణుడు గోకులమును వీడి మధుర కేగినపుడు గోపికలు కృష్ణవియోగమును సహించలేక అడ్డుపడిరి. కృష్ణుడు మధురలో కార్యములను నెరవేర్చి తిరిగి వత్తుననివారి ననునయించి మధురకు వెళ్ళెను. ఇపుడు గోకులమునకు పోగోరిన వాడై ఉద్ధవుని పిలిచి 'నీవు గోకులమునకు జని, మా తల్లి తండ్రులైన యశోదా నందులకు, నన్ను ప్రాణములకన్న ఎక్కువగా ప్రేమించిన గోపికలకు నా క్షేమమును తెలిపి నా రాకను ఎరిగింప'మని చెప్పి పంపెను.

గోకులము చేరిన ఉద్ధవుని నందుడు కౌగలించుకొని సకలోపచారములు గావించి కృష్ణుని యోగక్షేమములు నరిసి నంతసించెను. మరునాడు ఉదయమున గోపికలను కలుసుకొనుటకుగాను బంగారు రథముపై బయలుదేరెను. గోపికలు తెల్లవారుజామున లేచి కృష్ణలీలలను పరమానందముతో పాడుకొనుచూ రథముపైనున్న ఉద్ధవుని చూచి అలనాడు కృష్ణుని మధురకు గొంపోయి తమకు ఎడబాటు కలిగించిన కౄరుడైన అకౄరుడితడేయని గ్రహించి వానిని సమీపించి యిట్లనిరి ''కృష్ణుడు పంపగా మీరు వచ్చినట్లున్నది. ఈ గోకులములో ఆతని తల్లి దండ్రులున్నారు గాన వారి యోగక్షేమములు తెలిసికొనుటకు నిన్ను పంపినాడు కాబోలు! మాతో పని పూర్తి అయినది గనుక మేము ఆయనకు గుర్తుండము కాబోలు! ఋత్విక్కులు దక్షిణ పుచ్చుకొన్నపిదప యజమానిని మరచినట్లు, పండ్లు ఉడిగిన చెట్టును పక్షులు విస్మరించినట్లు, స్త్రీని అనుభవించిన తదుపరి ఆమెను మరచిపోవు జారపురుషుని వలెనే కృష్ణుడు మమ్ములను మరచినాడు. అయిననూ మేము అతనికి జ్ఞాపకము ఉండతగిన వారమా!'' ఈ విధముగా కృష్ణవినియోగమును సహించలేక ఉద్ధవుని ఒక భ్రమరముగా భావించి అనేకములైన నిష్ఠురోక్తులతో పాడిరి. వానినే భ్రమరగీత లందురు. ఇది పదునొకండు గీతము లతో వెలసిన అద్భుత శృంగార ప్రేమ భావములుగల ఘట్టము. దీనికి అనేక వ్యాఖ్యానములు గలవు. ఇట్లు గోపికలు కృష్ణదర్శన లాలసలై పాడిన గీతములు విని, వారికి కృష్ణుని యందున్న అద్భుత ప్రేమభక్తికి ఆశ్చర్యము పొంది కృష్ణ సందేశమును ఉద్ధవుడు ఇట్లు చెప్పెను. ''గోపికలారా! సాక్షాత్‌ భగవత్స్వరూపుడైన కృష్ణునియందు మీ మనస్సులను లగ్నము చేసినారు గాన మీరు కృతార్థులు. మీరు లోకమందరిచే పూజింప దగినవారు. మనులకు గూడ దుర్లభ##మైన భక్తిని మీరు భార్యవశమున బడసితిరి. మీరు పతి పుత్ర-దేహ-గేహాదులను విస్మరించి కృష్ణుని పరమపరుషునిగా వరించి ఏకాంత భక్తిచేసితిరి. మీ భక్తిని చూడ, కృష్ణ భక్తుడననుకొన్న నాకే సిగ్గు వచ్చునట్లు చేసినది. ఇది నాకు అనుగ్రహముగా భావించుచున్నాడను. కృష్ణుని సందేశ##మేమగా, ''ఈ సకల చరాచర ప్రపంచము సందంతనూ సర్వాత్ముడనై వర్తించు నా వియోగము మీకు ఎప్పుడునూ కలుగదు. మీకు సన్నిహితముగా నున్నప్పుడు కన్నదూరముగా నున్నయెడల మీకు నాయందు ప్రేమ ద్విగుణీ కృతమగును. అందులకే నేనట్లు వర్తించితిని. నాపై లగ్న మనస్కలైన మీరు త్వరలో నన్ను పొందెదరు.'' అని తెల్పెను. అయిననూ సంతృప్తినందని గోపికలు కృష్ణుని నిందాస్తుతి చేయుచూ మధురవంటి రాజధాని నగరములోని నాగరిక లలనామణుల విలాసములతో తన్మయుడై యుండు కృష్ణుడు గ్రామ్యవనితలమైన మమ్ము ఎట్లు స్మరించును? వాని లీలలను మరచెదమన్న మరిపురాకున్నది, అని కృష్ణలీలలను పాడుకొనుచూ వ్యసనార్ణవమున మునిగిన తమను ఉద్ధరింపమని మా ప్రార్థనగా కృష్ణుని కెరింగింపుమని ఉద్ధవుని కోరిరి. గోపికల మధురభక్తికి తన్మయుడై వారి సన్నిధిలో కొన్ని మాసములు గడిపి, కృష్ణుడు తనను ఇచ్చటకు పంపుటమహోపకారముగా భావించి, గోపికల పాదరేణువులు తన శిరముపై బడునట్లు ఇచట తరులతా గుల్మ ఓషధులలో నొక దానిగ తాను జన్మించిన ధన్యమగుదునని, ముల్లోకములను పవిత్రముచేయు ఆ గోపికల పాదరజస్సునకు మ్రొక్కెదనని తనలో ధ్యానించి వారివద్ద శలవు గైకొని యశోదానందులు, గోపికలు కృష్ణునికి ఇచ్చిన కానుకలను తీసుకొని భారహృదయముతో వారివద్ద వీడ్కోలు తీసుకొని మధురకేగి కృష్ణునికి గోపికలభక్తి ఉద్రేకములను ఉద్రేకములను సవివరముగా తెల్పెను.

తరువాత కృష్ణుడు పాండవుల యోగక్షేమములు తెలుసుకొనుటకు గాను ఉద్ధవుని హస్తినాపురమునకు పంపెను. అచ్చట విదురుని, కుంతీదేవిని కలిసి ఆమె చెప్పుకొన్న కష్టములను విని కృష్ణునికి తన ప్రార్థనగా ఆమె తెలిపిన వచనములు విని, ధృతరాష్ట్రుని కలసి, పాండవులయెడ ప్రేమతో ప్రవర్తించ మని ధర్మప్రబోధము చేసెను. పుత్రానురాగ పశుడైన ధృతరాష్ట్రునికి ఆమాటలు చెవికెక్క లేదు. అయిననూ భూభారహరణార్థము యదుకులమున అవతరించిన ఆ పరమ పురుషుడైన కృష్ణునికి తన నమస్కారముల నందజేయమని దెల్పగా, అకౄరుడు తిరిగివచ్చి హస్తినాపుర విశేషములను కృష్ణునకు ఎరుక పరచెను.

ముచుకుందునిచే కాలవయమని సంహారము చేయించుట-

ముచుకుందుని అనుగ్రహించుట - జరాసంధుని ముట్టడి-

ద్వారకను నిర్మించుట

కంస సంహారము కాగానే ఆతని భార్యలు అస్తి, ప్రాస్తి తమ పుట్టినింటికిజని తండ్రియగు జరాసంధునితో కృష్ణుడు తమభర్తను చంపిన వృత్తాంతమును తెలుపగా, జరాసంధుడు అమితక్రోధముతో ఇరువదిమూడు అక్షౌహిణుల సైన్యముతో వచ్చి మధురను ముట్టిడించెను. కృష్ణుడు, జరాసంధునితో సహా సైన్యమును పరిమార్చగలిగిననూ అట్లుచేయక జరాసంధుని వదలి, సైన్యమును హతమార్చెను. ఇట్లు చేయుటవలన జరాసంధుని మిగిలిన సేవలను తీసుకొని తిరిగి దండెత్తెను. ఇట్లు భూభారహరణముకై పదునేడుసారులు ఆతని విడచిపెట్టి సైన్యమును సమూలముగా నాశనము చేసెను. ఇకమిగిలిన జరాసంధుడు పదునెమిదవపర్యాయము మిగిలిన సైన్యముతో ముట్టడించుటకు వచ్చెను. ఇట్లుండ యవనుడను దుష్టవ్లుెచ్ఛ ప్రభువున్నూ తనసైన్యముతో లోకమునకు పీడగలుగ చేయుచుండుటచే వారుగూడ నిహతులైనగాని భూభారము తొలగదను తలంపుతో నారదుడు యవనుని గూడ పురిగొల్పెను. అతడు తన మూడుకోట్ల వ్లుెచ్ఛ సేనలతో మధురను ముట్టడించెను. ఇట్లు ఒకప్రక్కన యవనుడు, మరయొరిక ప్రక్కన జరాసంధుడు మధురను ముట్టడించగా, యాదవులను నిహతులు కాకుండా రక్షించుటకై విశ్వకర్మను రావించి సముద్రములో ద్వాదశయోజన విస్తీర్ణముగల పెద్దపట్టణమును జలదుర్గముగా నిర్మింపజేసెను. అట్టి లోకోత్తర విభవముతో నొప్పారు ద్వారకకు కృష్ణుడుతన మాయాప్రభావమున మధురలోని వారినందరనూ చేర్చి. బలరాముని వారికి రక్షణగా నియోగించి, తాను నిరాయుధుడై మధురనుండి పరుగెత్తుచుండెను.

నారదుడు తెల్పిన ఆనవాలును బట్టి అది కృష్ణుడేయని గ్రహించి యవనుడు కృష్ణుని వెంబడించెను. కృష్ణుడు వానికి చిక్కిచిక్కకుండా బహుదూరము తీసుకొనిపోయి ఒక గుహలోనికి గొంపోయెను. ఆగుహలో నిద్రించుచున్న ఒక సాధుపుంగవుని కృష్ణుడే దొంగని నిద్రపోవుచున్నాడని తలచి కాలితో తన్నెను. ఆపరుండిన మహాపురుషుడు ఇక్ష్వాకు చక్రవర్తి మాంధాత కుమారుడైన మునికుందుడు అతడు పరిపాలనపై వేసారి వైరాగ్యముతో మోక్షార్థియై వాసుదేవుని దర్శనము కొరకు ఆ గుహయంతు శయనించి యుండెను ఆ మహాపురుషుని కోపోద్రిక్త దృష్టి ప్రసారముతో యవనుడు భస్మమయ్యెను. అంత కృష్ణుడు ముచుకుందునకు దర్శనమిచ్చెను. ఆతడు తాను వాసుదేవునికై నిరీక్షించుచున్నాననియు, ఈ కృష్ణుడే వాసుదేవుడనియు గ్రహించి స్తుతించగా కృష్ణుడు భూభారహరణార్థమై తానే వాసుదేవునిగా జన్మించినానని తెల్పి ముచుకుందుని వరము కోరుకొమ్మని అడుగగా ఆతడు మోక్షము వినా మరేమియు అక్కరలేదని తెల్పెను. అందుకు కృష్ణుడు ''నీవు క్షత్రియుడవైజన్మించి క్షాత్రధర్మమున కొంత పాపము ఆచరించియుందువు. అది పరిహారమగుటకు తపమాచరించి పరిశుద్ధుడవై రాబోవు జన్మలో బ్రాహ్మణుడవై తపమొనరించి బ్రహ్మర్షివై తరించెదవని అనుగ్రహించెను. అంత ముచుకుందుడు బదరికాశ్రమమునకు జని శాంతుడై తపంబున హరిని ఆరాధించెను.

కృష్ణుడు తిరిగి మధుకు వచ్చి అచట నిలిచియున్న వ్లుెచ్ఛసైన్యమును సంహరించి ద్వారకకుపోవు సముయమున జరాసంధుడు పదునెమిదవసారి యుద్ధమునకు వచ్చెను. రామకృష్ణులు అతనికి భయపడుతున్నట్లు నటించి పరుగిడి ప్రవర్షణ పర్వతము నధిరోహించి, దానిపైన్ను అరణ్యమున దాగుకొన్నట్లు భ్రమింపజేసి, ద్వారకకు జేరిరి. జరాసంధుడు వారిని హతమార్చ తలంపుతో ఆ యడవికి నిప్పుపెట్టి రామకృష్ణులు అందులో దగ్ధమైనారను భావముతో తననగరమునకు వెడిలిపోయెను జరాసంధుడు మున్ముందు భీమునిచే చంపబడ వలసియుండుటచే, ఆతనిని రామకృష్ణులు చంపకవిడచిపుచ్చిరి. రామకృష్ణులు ద్వారకలో సుఖముగా నుండిరి.

     

 
       
     

"Bharath First - I Love My Bharath"

   
 

www.sanatanadharm.com - play store app (sanatana dharm)  

 
 

"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. 2019-2025 Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.